Contact: +91 844 894 1008
bgwebsite_logo
Bhagavad Gita
The Song of God

Bhagavad Gita: Chapter 2, Verse 13

దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।

దేహినః — దేహములోనున్న వాడు; అస్మిన్ — దీనిలో; యథా — ఎట్లయితే; దేహే — శరీరంలో; కౌమారం — బాల్యము; యౌవనం — యుక్తవయస్సు; జరా — వార్ధక్యము (ముసలితనము); తథా — ఆ విధముగానే; దేహ-అంతర — ఇంకొక దేహము; ప్రాప్తిః — పొందును; ధీరః — వివేకులు; తత్ర — ఆ విషయములో; న ముహ్యతి — భ్రమకు లోనవ్వరు;

Translation

BG 2.13: ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహము లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు.

Commentary

శ్రేష్ఠమైన తర్కముతో శ్రీ కృష్ణుడు, ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు, ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించే సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు. ఒక జన్మలోనే మనము బాల్యము, యౌవనము, యుక్తవయసు, తదుపరి వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాము అని వివరిస్తున్నాడు. వాస్తవానికి, ఆధునిక శాస్త్రము ప్రకారం శరీరంలోని జీవ కణాలు నిరంతరంగా పునరుత్పత్తి చెందుతుంటాయి - పాత కణాలు మృతినొందుతూ, వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతుంటాయి. ఒక అంచనా ప్రకారం, ఏడు సంవత్సరాల లోపు, అన్నీ జీవకణాలు మారిపోతాయి. అంతేకాక, కణాలలోని అణువులు ఇంకా వేగంగా మారిపోతాయి. మనము తీస్కునే ప్రతి శ్వాస ద్వారా జీవక్రియచే, ఆక్సిజన్ అణువులు జీవకణాల లోనికి పీల్చబడి, అప్పటివరకు కణాలలో ఉన్న అణువులు కార్బన్-డై-ఆక్సైడ్ రూపంలో విడుదల చేయబడతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక సంవత్సర కాలం లోనే మన శరీరంలోని తొంభై ఎనిమిది శాతం అణువులు మారిపోతాయి. అయినా సరే, నిరంతరం శరీరం మారిపోతున్నా, మనకు అదే వ్యక్తిని అన్న భావన ఉంటుంది. ఇది ఎందుకంటే మనము ఈ భౌతిక శరీరము కాదు, మనము లోపల వసించి ఉన్న ఈశ్వర-సంబంధియైన జీవాత్మ.

ఈ శ్లోకంలో, దేహ అంటే శరీరము, మరియు దేహి అంటే 'దేహమును కలిగియున్నది' అంటే జీవాత్మ. ఒక జీవితకాలం లోనే శరీరం నిరంతరంగా మారుతూ ఉండటంవలన ఆత్మ చాలా శరీరాలు మారినట్టే, అని అర్జునుడు గుర్తించేట్టు చేస్తున్నాడు శ్రీ కృష్ణుడు. అదే విధంగా, ఇది మరణం తరువాత ఇంకొక శరీరంలోనికి వెళుతుంది. నిజానికి, ప్రాపంచిక పరిభాషలో, 'మరణం' అని మనం అనుకునేది, జీవాత్మ తన యొక్క పనిచేయని పాత శరీరాన్ని త్యజించడం మాత్రమే, మరియు ‘పుట్టుక’ అని చెప్పుకునేది, జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకోచోట తీసుకోటమే. ఇదే పునర్జన్మ సిద్ధాంతం.

చాలామటుకు తూర్పుదేశ తత్త్వశాస్త్రములు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. హిందూ, జైన, మరియు సిక్కు మతాలలో ఇది అంతర్భాగం. బౌద్ధధర్మంలో, బుద్ధుడు తన గత జన్మలను చాలా సార్లు ప్రస్తావించాడు. పాశ్చాత్య తత్త్వశాస్త్ర సిద్ధాంతాల్లో కూడా పునర్జన్మ సిద్ధాంతం ఎంత ప్రబలంగా ఉండేదో చాలా మందికి తెలియదు. పురాతన పాశ్చాత్య మతాలు, తత్త్వశాస్త్ర వర్గాల్లో, ప్రసిద్ధ ఆలోచనాపరులు పైథాగరస్, ప్లేటో, మరియు సోక్రటీస్ వంటి వారు పునర్జన్మ నిజమని అంగీకరించారు మరియు వారి అభిప్రాయాలు కూడా ఆర్ఫిజం, హెర్మెటిసిజం, నియోప్లాటోనిజం, మానిచియానిజం, మరియు గ్నోస్టిసిజం (Orphism, Hermeticism, Neoplatonism, Manichaenism, and Gnosticism) లలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమైన అబ్రహమిక్ మతాలలో, మూడు ప్రధాన మతాల తత్త్వవేత్తలు కూడా పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతు పలికారు. ఉదాహరణకి, కబ్బలాహ్ ని అధ్యయనం చేసిన యూదులు, క్రైస్తవ కాథర్లు, మరియు అలావి షియాలు, డ్రూజ్ వంటి ఇస్లాం షియా శాఖలు. పాశ్చాత్య మతాలలో, ఉదాహరణకి, గొప్ప పురాతన యూదు చరిత్రకారుడు అయిన జోసెఫస్, తన రచనల్లో ఉపయోగించిన భాష ప్రకారం, ఆ కాలపు ఫారిసీలు మరియు ఎస్సెనెలల్లో పునర్జన్మ నమ్మకం ఉన్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా యూదు కబ్బాలాహ్, పునర్జన్మని, 'గిల్గుల్ నేశామోట్' (gilgul neshamot), లేదా 'ఆత్మ యొక్క దొర్లుట' అని చెప్పడము జరిగింది. ప్రఖ్యాత సూఫీ తత్త్వవేత్త మౌలానా జలాలుద్దీన్ రూమీ ఈ విధంగా ప్రకటించాడు:

నేను రాయిగా చనిపోయి ఒక చెట్టు అయ్యాను; (I died out of the stone and I became a plant)
నేను చెట్టుగా చనిపోయి ఒక జంతువు అయ్యాను (I died out of the plant and became an animal)
నేను జంతువుగా చనిపోయి ఒక మనిషిని అయ్యాను (I died out of the animal and became a man)
అలాంటప్పుడు నేను మరణం గురించి ఎందుకు భయపడాలి? (Why then should I fear to die?)
మరణించి నేను తక్కువ అయిపోయింది ఎప్పుడు? (When did I grow less by dying?)
నేను మనిషిగా చనిపోయి ఒక దేవత అవుతాను! (I shall die out of man and shall become an angel!)

అనేక మంది ప్రాచీన క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు. క్రైస్తవ చరిత్ర తెలియచేసిన ప్రకారం, పునర్జన్మ సిద్ధాంతాన్ని చర్చించడానికి 325 AD లో, కౌన్సిల్ ఆఫ్ నైసియా (Council of Nicaea), సమావేశం జరిగింది, మరియు బహుశా ప్రజల జీవితాలపై చర్చి యొక్క ఆధిపత్యం పెంచడానికి కాబోలు, తదుపరి అది (పునర్జన్మ సిద్ధాంతం) మతవిరోధముగా ప్రకటించబడింది. అప్పటివరకు అది సర్వ-సాధారణముగా అంగీకరించబడింది. ఏసుక్రీస్తు తన శిష్యులకు, ‘జాన్ ద బాప్టిస్ట్’ (John the Baptist) అనేవారు 'ఎలైజా ద ప్రాఫెట్’ (Elijah the Prophet) యొక్క అవతారమే అని చెప్పటం ద్వారా, పరోక్షంగా ఈ సిద్ధాంతాన్ని ప్రకటించారు. (మాథ్యూ 11:13-14, మాథ్యూ 17:10-13). ఇది పాత నిబంధన (ఓల్డ్ టెస్టమెంట్) లో కూడా పేర్కొనబడింది. (Malachi 4:5). క్రైస్తవ ఫాదర్లలో అత్యుత్తమ పండితుడు అయిన ఒరిజెన్, ఇలా ప్రకటించారు: ‘ప్రతి మనిషి తన పూర్వ జన్మల కర్మల అనుగుణంగా ఒక శరీరం పొందుతాడు’ (Every man receives a body for himself according to his deserts in former lives) సోలమన్ యొక్క 'బుక్ అఫ్ విస్డం' ప్రకారం: ‘మంచి శరీరంతో సక్రమమైన అవయవాలతో పుట్టడం అనేది పూర్వ జన్మలలో చేసిన మంచి పనుల ప్రతిఫలం.’ (To be born in sound body with sound limbs is a reward of the virtues of the past lives) (విస్డం ఆఫ్ సోలోమన్, Wisdom of Solomon 8:19-20)

ప్రపంచవ్యాప్తంగా, సైబీరియా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, మరియు ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో, అనేక ఆదివాసీ సమాజాలలో పునర్జన్మపై నమ్మకం కనబడుతుంది. ఇక ఇటీవలి శతాబ్దాల కాలంలో మరియు నాగరికతల్లో చూస్తే, రోసిక్రూసియన్స్, స్పిరిటిజం, థియోసాఫిస్ట్స్ మరియు న్యూ ఏజ్ (Rosicrucians, Spiritism, Theosophists, and New Age) అనుసరించేవారిలో పునర్జన్మ విశ్వసించబడింది. ఇంకా ఇటీవలే, ప్రముఖ విశ్వవిద్యాలయాల గంభీర శాస్త్రీయ వర్గాలలో ఇది అధ్యయనం చేయబడింది, ఉదాహరణగా వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ మరియు డాక్టర్ జిమ్ టకర్ యొక్క రచనలను చెప్పవచ్చు.

పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా, ప్రపంచంలోని కష్టాలు, గందరగోళాలు, మరియు అసంపూర్ణతలను అర్థం చేసుకోలేము, అందుకే, అనేక ప్రసిద్ధ పాశ్చాత్య తత్త్వవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నమ్మారు. వర్జిల్ మరియు ఓవిడ్, ఈ సిద్ధాంతం స్పష్టంగా దానికదే తెలిసిపోతోందని భావించారు. జర్మన్ తత్త్వవేత్తలు గోతే, ఫిష్టే, షెల్లింగ్, మరియు లెస్సింగ్ (Goethe, Fichte, Schelling, and Lessing) దీన్ని అంగీకరించారు. మరింత ఇటీవల తత్త్వవేత్తలైన హ్యూమే, స్పెన్సర్, మరియు మాక్స్ మ్యుల్లర్ (Hume, Spencer, and Max Müeller) వీరందరూ దీనిని నిర్వివాదమైన సిద్ధాంతమని ఒప్పుకున్నారు. పాశ్చాత్య కవులలో, బ్రౌనింగ్, రోసెట్టి, టెన్నిసన్, మరియు వర్డ్స్ వర్త్ (Browning, Rosetti, Tennyson, and Wordsworth) మొదలగు వారు అందరూ దీనిని నమ్మారు.

శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వము, వివేకులు శోకింపరు అని చెప్పి ఉన్నాడు. కానీ, నిజానికి మనము సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. దీనికి గల కారణం ఏమిటి ? ఇప్పుడు ఆ విషయాన్ని వివరిస్తాడు.

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
2. సాంఖ్య యోగము

Quick Jump to Any Verse

Navigate directly to the wisdom you seek

Book with feather

Stay Connected!

Verse of the Day

Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!

Thanks for subscribing to "Bhagavad Gita - Verse of the Day"!