Contact: +91 844 894 1008
bgwebsite_logo
Bhagavad Gita
The Song of God

Bhagavad Gita: Chapter 2, Verse 7

కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః ।
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ।। 7 ।।

కార్పణ్య-దోషా — పిరికితనము అనెడు దోషము; ఉపహత — ముట్టడి చేయబడి; స్వ-భావః — స్వభావము; పృచ్ఛామి — అడుగుతున్నాను; త్వాం — మిమ్ములను; ధర్మ — ధర్మమును; సమ్మూఢ — కలవరపడ్డ; చేతాః — చిత్తముతో; యత్ — ఏది; శ్రేయః — శ్రేయస్కరము; స్యాత్ — అగునో; నిశ్చితం — నిశ్చయముగా; బ్రూహి — తెలుపుము; తత్ — అది; మే — నాకు; శిష్యః — శిష్యుడను; తే — నీ యొక్క; అహం — నేను; శాధి — దయచేసి ఉపదేశం చేయుము; మాం — నేను; త్వాం — నీకు; ప్రపన్నమ్ — శరణాగతుడను.

Translation

BG 2.7: నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము.

Commentary

భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం. శ్రీ కృష్ణుడి సఖుడు, బావ అయిన అర్జునుడు మొదటిసారి కృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు. కార్పణ్య దోషం, అంటే, పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు, తనను లొంగదీసుకుందని, అందుచేత, భగవంతుడిని తన గురువుగా ఉండమని, తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని, బ్రతిమాలుతున్నాడు.

ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని, సమస్త వైదిక గ్రంథాలు ఏకకంఠంతో చెప్తున్నాయి.

తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిః

శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్ (ముండకోపనిషత్తు 1.2.12)

 

‘పరమ సత్యాన్ని తెలుసుకోడానికి, వైదిక వాఙ్మయం తెలిసినవాడు, ఆచరణాత్మకంగా భగవత్ ప్రాప్తినొందిన గురువుని ఆశ్రయించాలి’

తస్మాద్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసుః శ్రేయ ఉత్తమమ్
శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయమ్

(భాగవతం 11.3.21)

 

‘సత్యాన్ని అన్వేషించేవారు, తమనితాము ఆధ్యాత్మిక గురువుకి శరణాగతం చేసుకోవాలి, ఆయన ప్రాపంచికత్వాన్ని త్యజించి, శాస్త్రముల సారాన్ని అర్థంచేసుకున్నవాడై, సంపూర్ణంగా భగవంతుడినే ఆశ్రయించినవాడై ఉండాలి.’

రామచరితమానస్ ఇలా పేర్కొంటున్నది:

గురు బిను భవ నిధి తరఇ న కోఈ, జో బిరంచి శంకర సమ హోఈ

‘ఆధ్యాత్మిక సాధకులు ఎంత ఉన్నత స్థాయి వారైనా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు.’ శ్రీ కృష్ణుడు తనే స్వయంగా భగవద్గీతలో 4.34వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పాడు: ‘పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి. పూజ్యభావంతో అడగండి మరియు వారికి సేవ చేయండి. అలాంటి జ్ఞానోదయమైన సత్పురుషుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు, ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నవాడు.’

జ్ఞాన సముపార్జన కోసం గురువుని ఆశ్రయించటం యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో తెలియచెప్పటానికి, స్వయంగా శ్రీ కృష్ణుడే ఆ పని చేసాడు. తన యౌవ్వనంలో, అరవై నాలుగు శాస్త్రాలను నేర్చుకోడానికి, సాందీపనిముని ఆశ్రమానికి వెళ్ళాడు. కృష్ణుడి సహవిద్యార్థి సుదాముడు ఇలా అన్నాడు:

యస్య ఛందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో
శ్రేయసాం తస్య గురుషు వాసోఽత్యంతవిడంబనం (భాగవతం 10.80.45)

‘ఓ శ్రీ కృష్ణా, వేదములు నీ శరీరము వంటివి, అవి నీ జ్ఞానం నుండే వ్యక్తమైనవి (కావున నీకు గురువు యొక్క అవసరం ఏమున్నది?). అయినాసరే, నీవు కూడా గురువు ద్వారా నేర్చుకోవాలని నటిస్తున్నావు. ఇది నీ యొక్క దివ్య లీల మాత్రమే.’

శ్రీ కృష్ణుడు నిజానికి ప్రథమ జగద్గురువు, ఎందుకంటే అతను భౌతిక ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన బ్రహ్మ దేవునికే గురువు. మాయ యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్మలకి అజ్ఞానం తొలగించటానికి ఒక గురువు అవసరము ఉంటుంది, అని, తన ఉదాహరణతో చెప్పటానికి, ఈ లీలని మన శ్రేయస్సు కోసమే చెసాడు. ఈ శ్లోకంలో అర్జునుడు, ఒక శిష్యుడిగా శ్రీ కృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువు గారిని సరియైన దిశానిర్దేశము కొరకు, జ్ఞానోపదేశం చేయమని ప్రార్థిస్తున్నాడు.

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
2. సాంఖ్య యోగము

Quick Jump to Any Verse

Navigate directly to the wisdom you seek

Book with feather

Stay Connected!

Verse of the Day

Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!

Thanks for subscribing to "Bhagavad Gita - Verse of the Day"!