Contact: +91 844 894 1008
bgwebsite_logo
Bhagavad Gita
The Song of God

Bhagavad Gita: Chapter 12, Verse 2

శ్రీ భగవానువాచ ।
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే ।
శ్రద్ధయా పరాయోపేతాస్తే మే యుక్తతమా మతాః ।। 2 ।।

శ్రీ-భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; మయి — నా యందు; ఆవేశ్యా — నిమగ్నమై; మనః — మనస్సు; యే — ఎవరైతే; మాం — నన్ను; నిత్య యుక్తః — ఎల్లప్పుడూ లగ్నం చేసి; ఉపాసతే — పూజిస్తారో/ఆరాధిస్తారో; శ్రద్ధయా — శ్రద్దా-విశ్వాసములతో; పరయా — అత్యుత్తమ; ఉపేతాః — కలిగియున్న; తే — వారు; మే — నా చేత; యుక్త-తమాః — యోగములో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టు; మతాః — నేను భావిస్తాను.

Translation

BG 12.2: శ్రీ భగవానుడు ఇలా పలికెను: నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతమూ నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను.

Commentary

భగవంతుడిని దూరంనుండి, కొంచెం దగ్గర నుండి, అతి సమీపం నుండీ, ఇలా ఎన్నో రకాల సామీప్యతలలో అనుభవించవచ్చు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము. మీరు రైలు పట్టాల పక్కన నిల్చున్నారనుకోండి. ఒక రైలు దూరం నుండి దాన్ని హెడ్ లైటు వేసుకుని వస్తుంటుంది. అది మీకు ఏదో ఒక లైటు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రైలు కొంచెం దగ్గరగా వస్తుందో, ఆ లైటుతో పాటు ఏదో ఒక రూపము చూచాయిగా అగుపిస్తుంది. చివరికి, అది వచ్చి ప్లాటుఫారం మీద ఆగినప్పుడు, మీరు ‘ఓ! ఇదొక రైలు, దీని కంపార్టుమెంట్ల లోపల కూర్చొని, బయటకు తొంగి చూసే వారందరినీ చూడగలుగుతున్నాను.’ అని తెలుసుకుంటారు. ఇదే ట్రైను దూరం నుండి ఒక లైటు మాదిరిగానే కనిపించింది. అది కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు లైటుతో పాటు ఏదో మెరుస్తూఉన్న ఒక రూపముతో కనిపించింది. అది ఇంకా దగ్గరగా రాగానే అదొక రైలు అని మీకు తెలిసి పోయింది. రైలు అదే, కానీ దానికి దగ్గరగా ఉండే కొలదీ దాని యొక్క వివిధ లక్షణములైన - రూపము, రంగు, ప్రయాణీకులు, బోగీలు, తలుపులు, మరియు కిటికీల - గురించి మీ యొక్క అవగాహన పెరిగింది.

అదే విధముగా, భగవంతుడు దోష-రహితుడు, పరిపూర్ణుడు, మరియు అనంతమైన శక్తులను కలిగి ఉన్నవాడు. ఆయన యొక్క వ్యక్తిత్వము - దివ్య నామములు, రూపములు, లీలలు, గుణములు, పరివారము, మరియు ధామములతో - నిండి ఉన్నది. కానీ, ఆయనను విభిన్న సామీప్యతా స్థాయిలలో అనుభవించవచ్చు, బ్రహ్మన్ లాగా (భగవంతుని యొక్క నిరాకార సర్వ వ్యాప్త అస్తిత్వము), పరమాత్మ లాగా (సమస్త ప్రాణుల హృదయములలో కూర్చుని ఉన్న పరమాత్మ, ఇది జీవాత్మ కంటే వేరైనది) మరియు భగవాన్ లాగా ( భూ-లోకమునకు దిగి వచ్చిన భగవంతుని సాకార రూపము).

భాగవతము ఇలా పేర్కొంటున్నది:

వదన్తి తత్తత్త్వవిదస్తత్త్వం యజ్-జ్ఞానమద్వయమ్
బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్ద్యతే (1.2.11)

‘ఉన్నది ఒకే ఒక పరమేశ్వర తత్త్వము అని పరమ సత్యమును ఎరిగిన వారు ఇలా చెప్పారు; అదే జగత్తులో మూడు రకాలుగా వ్యక్తమవుతోంది — బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు అనే విధాలుగా.’ వీరు మూడు వేరు వేరు దేవుళ్ళు కారు; సర్వశక్తిమంతుడైన భగవంతుని యొక్క మూడు రకాల ప్రకటితములు. కానీ, వీరి యొక్క గుణములు భిన్నములు. ఇది ఎలాగంటే, నీరు, నీటి-ఆవిరి మరియు మంచుగడ్డ ఈ మూడూ కూడా ఒకే హైడ్రోజన్ డయాక్సైడ్ పదార్థపు అణువులను కలిగి ఉంటాయి, కానీ వాటి యొక్క భౌతిక గుణములు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ బాగా దాహంతో ఉన్న వ్యక్తి నీటి కోసం అడిగితే, అతనికి మనం మంచుగడ్డ ఇస్తే, దానితో అతని దాహం తీరదు. మంచుగడ్డ మరియు నీరు ఒకే పదార్థమయినా వాటి యొక్క భౌతిక లక్షణములు భిన్నములు. అదే విధముగా, బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు అనేవారు ఒకే సర్వోన్నత ఈశ్వరుని యొక్క ప్రకటితములు కానీ వాటి వాటి గుణములు భిన్నములు.

బ్రహ్మన్ అంటే ఈశ్వరుని యొక్క సర్వ-వ్యాప్త స్వరూపము, ఇది అంతటా ఉంటుంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది :

ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా (6.11)

‘ఉన్నది ఒకే ఒక పరమేశ్వర తత్త్వము. ఆయనే అన్నింటిలోపలా మరియు అందరి లోపల కూర్చుని ఉన్నాడు.’ ఈ యొక్క ఈశ్వరుని యొక్క సర్వ వ్యాప్త అస్తిత్వమునే బ్రహ్మన్ అంటారు. అది, నిత్యశాశ్వతత్వము, జ్ఞానము, మరియు ఆనందములతో నిండి ఉన్నది. కానీ, ఈ యొక్క అస్తిత్వములో, భగవంతుడు తన అనంతమైన గుణములను, మనోహరమైన సౌందర్యమును, మరియు మధురమైన లీలలను వ్యక్తపరచడు. ఆయన ఒక దివ్య కాంతి వలె నిర్గుణ (గుణములు లేకుండా), నిర్విశేష (లక్షణములు లేకుండా), నిరాకార (రూపము లేకుండా) అస్తిత్వములో ఉంటాడు.

జ్ఞాన యోగ మార్గమును అనుసరించేవారు ఈ యొక్క అస్తిత్వమునే ఉపాసిస్తారు. ఇది, ఇందాక ఉదాహరణలో రైలుని దూరం నుండి ఒక లైటు లాగా అనుభవించిన మాదిరిగా, ఈశ్వరుడిని నిరాకార కాంతి వలె దూరం నుండి తెలుసుకున్నట్టు ఉంటుంది.

పరమాత్మ అంటే అందరి హృదయములలో కూర్చుని ఉన్న ఈశ్వర స్వరూప తత్త్వము. 18.61వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: ‘పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.’ మనలోనే నివసిస్తూ ఈశ్వరుడు మన యొక్క అన్ని తలంపులను మరియు కర్మలను నోటు చేసుకుంటాడు, వాటి లెక్క వ్రాసుకుంటాడు మరియు సరియైన సమయములో వాటి ఫలములను అందచేస్తూ ఉంటాడు. మనము ఏం చేసామో మనము మర్చిపోవచ్చు, కానీ భగవంతుడు మర్చిపోడు. ఆయన మనం పుట్టినప్పటి నుండి మన యొక్క అన్ని తలంపులను, మాటలను, మరియు చేష్టలను గుర్తుంచుకుంటాడు. ఇంకా ఈ ఒక్క జన్మ లోనే కాదు! అనంతమైన జన్మలలో, మనం ఎక్కడికి వెళ్లినా, భగవంతుడు మనతోపాటే వెళ్ళాడు. ఆయన ఎంత చక్కటి మిత్రుడంటే మనలను ఒక్క క్షణం కూడా వదలడు. మనలోనే స్థితమై ఉన్న ఈ యొక్క ఈశ్వరుని అస్తిత్వమే పరమాత్మ.

పతంజలి మహర్షి, యోగ దర్శనములో తెలియపరిచిన అష్టాంగ యోగ మార్గము, మనయందే స్థితమై ఉన్న ఈశ్వరుడిని అనుభవము లోనికి తేవటానికి పరిశ్రమిస్తుంది - అది ఈశ్వరుని యొక్క పరమాత్మ రూప అస్తిత్వమును అనుభవములోనికి తెస్తుంది. ఇందాకటి ఉదాహరణలో, దూరం నుండి లైటులా కనపడిన రైలు, కాస్త దగ్గరకు రాగానే కొంతమేర వెలిగే రూపముతో కనపడినట్టు, పరమేశ్వర తత్త్వమును పరమాత్మ లాగా తెలుసుకోవటం అనేది నిరాకార బ్రహ్మన్ ను కొంత దగ్గరగా తెలుసుకోవటమే.

భగవానుడు అంటే ఈశ్వరుని యొక్క సాకార రూప ప్రకటితము. శ్రీమద్ భాగవతము ఇలా పేర్కొంటున్నది:

కృష్ణం ఏనం అవేహి త్వం ఆత్మానం అఖిలాత్మనాం
జగద్-ధితాయ సోఽ ప్యత్ర దేహీవాభాతి మాయయా (10.14.55)

‘సకల ఆత్మలకు పరమాత్మయైన సర్వోత్కృష్ట ఈశ్వరుడు, ఈ భూమిపై తన సాకార రూపములో, లోక-సంక్షేమం కోసం శ్రీకృష్ణుడిలా అవతరించాడు.’ ఈ యొక్క భగవానుని అస్తిత్వంలో, ఈశ్వరుడు తన యొక్క నామములు, రూపములు, గుణములు, ధామములు, లీలలు, మరియు పరివారముల యొక్క సమస్త మాధుర్యమును, వ్యక్త పరుస్తాడు. ఈ యొక్క గుణములు బ్రహ్మన్ మరియు పరమాత్మ అస్తిత్వములలో కూడా ఉంటాయి, కానీ అవి బయటపడకుండా అంతర్గర్భితమై ఉంటాయి. ఇది ఎలాగంటే, ఒక అగ్గిపుల్లలో అగ్ని దాగి ఉంటుంది, మరియు దాని లోని అగ్ని, పెట్టెకు గీసినప్పుడే వ్యక్తమౌతుంది. అదే విధముగా, భగవానుడి స్వరూపములో, ఈశ్వరుని యొక్క అన్నీ శక్తులు మరియు లక్షణములు, ఇతర రూపములో అంతర్గర్భితమై ఉన్నటువంటివి, ప్రకటితమవుతాయి.

భక్తి మార్గము అనేది ఈశ్వరుని యొక్క భగవానుని స్వరూపము యొక్క అనుభవమునకు దారి తీస్తుంది. ఇది దేవుని అత్యంత దగ్గరి అనుభవము. ఇందాకటి ఉదాహరణలో, ట్రైను యొక్క వివరములు, అది చూసేవాడి ముందే దగ్గరగా వచ్చి ఆగి ఉన్నపుడు స్పష్టంగా కనిపించినట్టు అన్నమాట. కాబట్టి 18.55వ శ్లోకములో, శ్రీ కృష్ణుడు ఈ విధంగా పేర్కొంటున్నాడు: ‘కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో (ఎంతటి వాడనో) తెలుకోవచ్చును.’ ఈ విధముగా, శ్రీ కృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నకు, తన సాకార వ్యక్త రూపమును ఆరాధించే భక్తుడే అత్యున్నతమైన యోగి అని వివరణ ఇస్తున్నాడు.

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
12. భక్తి యోగము
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

Quick Jump to Any Verse

Navigate directly to the wisdom you seek

Book with feather

Stay Connected!

Verse of the Day

Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!

Thanks for subscribing to "Bhagavad Gita - Verse of the Day"!